Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడని మొదటి భార్య కుమార్తెలు రోడ్డెక్కారు. నాన్నను కలవాలని ఉందంటూ దువ్వాడ ఇంటిముందు అర్ధరాత్రి దాకా పడిగాపులు పడ్డారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి స్పందించారు.
తన భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు. ఆయన వల్ల తన కుటుంబం పరువు పోతుందని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలివెళ్లాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు. చొక్కా లుంగీతో వచ్చిన శ్రీనివాస్‌కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు. ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆయన ఇంటికి కుమార్తెలు హైందవి, నవీనలు గురువారం వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినప్పటికీ రాత్రి 8 గంటలు అయినా వాళ్లను లోపలికి అనుమతించలేదు. చీకటి కావడంతో లైట్లు ఆర్పేశారు. దీంతో రాత్రి సమయంలో అక్కడే ఆందోళనకు దిగారు. దివ్వెల మాధురి అనే మహిళతో తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్‌గా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏ హక్కుతో ఆమె తమ ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు. ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా వాళ్ల డాడీ దూరంగా ఉంటున్నాడని.. ఎన్ని మెసేజ్‌లు చేసినా, కాల్స్ చేసినా స్పందించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.