Dadisetti Raja | ఏ ఒక్క రైతు నుంచి తాను భూమిని లాక్కోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా వెల్లడించారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్‌లో భూములు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో ఉంటే భూములు కొనుక్కోకూడదా అని ప్రశ్నించారు. దీనిపై బురద జల్లడమే కొంతమంది పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ మధ్య భూములు కొనుక్కున్నారని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో 15 ఎకరాల భూమి కొనుగోలు చేశారని దాడిశెట్టి రాజా తెలిపారు. గత పదిరోజుల్లో యనమల రామకృష్ణుడు రెండు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల రామకృష్ణుడు ఏ రైతులు, పేదల నుంచో భూములను లాక్కున్నారని తాను కూడా ఆరోపించగలనని తెలిపారు. ఒక్క బకెట్ బురద జల్లితే సరిపోతుందా అని మండిపడ్డారు. వైసీపీలో ఉంటే భూములు కొనుక్కోవద్దా అని నిలదీశారు. తమది మొదట్నుంచి వ్యాపార కుటుంబం అని.. తాము అందరిలాగే చట్టబద్ధంగా భూములు కొంటే తప్పేముందని ప్రశ్నించారు.
యనమల రామకృష్ణుడు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చందాలు వేసుకుని గెలిపించారని దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. మరి అదే యనమల ఇప్పుడు డిస్టలరీలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇన్ని భూములు ఎలా కొనుగోలు చేశారని, అంత ఆస్తి ఎలా సంపాదించారని నిలదీశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన యనమల, వాటిని పేద ప్రజలకు పంచి పెట్టాలని.. అప్పుడు నీతులు చెబితే బాగుంటుందని సూచించారు.