Chevireddy Bhaskar Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో తన ఆస్తులను జప్తు చేయడం పట్ల వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. వందల ఏండ్ల నుంచి తమ కుటుంబసభ్యులకు సంక్రమించిన ఆస్తులను సిట్ అటాచ్మెంట్ చేసిందని తెలిపారు. ఇది ధర్మం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం మెజిస్ట్రేట్ఎదుట చెవిరెడ్డి మాట్లాడుతూ.. తను ఎలాంటి లిక్కర్ వ్యాపారం చేయలేదని తెలిపారు. ఒక్క రూపాయి కూడా మద్యం ద్వారా సంపాదించలేదని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా మాత్రమే సంపాదించానని చెప్పారు. లిక్కర్ స్కాం కేసుతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ కేసుల వల్ల నా కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
వందల ఏండ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ధర్మం కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నేను కష్టపడి సంపాదించిన దాన్ని లిక్కర్ ద్వారా సంపాదించానని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నేను మాట్లాడకపోతే నిజంగానే తప్పు చేశానని జనాలు అనుకుంటారని అన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైలులో పెట్టినా భయం లేదు.. ఎన్ని రోజులైనా జైలులో ఉంటానని స్పష్టం చేశారు.