Byreddy Siddharth Reddy |చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే అక్రమ అరెస్టులు ఉంటాయని తెలుసని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో శనివారం ఉదయం ఆయన ములాఖత్ అయ్యారు.
రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డితో కలిసి మిథున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని తెలిపారు. దేశంలోనే పెద్దస్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి అని కొనియాడారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బందని భావించి అక్రమ కేసులో అరెస్టు చేశారని ఆరోపించారు. కూటమి గాలి వీచినప్పటికీ ఉమ్మడి రాష్ట్రానికి మాజీ సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి విజయం సాధించారని తెలిపారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని అన్నారు.
కథలు చెప్పి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని గతంలో ఆరోపించారని.. అధికారంలోకి వచ్చాక ఒక్కరినైనా తిరిగి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కల్తీ లిక్కర్ తాగి వందలాది మంది చనిపోయారని అన్నారని.. వాటిలో ఒక్కదానికైనా ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది ఆస్పత్రి పాలైతే ఒక్క కేసు అయినా నమోదు చేశారా అని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు ఆధారాలు చెరిపేసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం దుర్మార్గమని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసులో టీడీపీ నాయకులపైనే ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై దశలవారీగా ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.