Botsa Satyanarayana | కడప పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. కడప పర్యటనలో హెచ్చరికలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తన సెక్యూరిటీ వైఫల్యాలకు ఎవర్ని బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భద్రతలో డొల్లతనానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. ప్రభుత్వం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బలహీనపడ్డారని అన్నారు. మా ఫోన్ ఎత్తాలంటేనే డీజీపీ భయపడిపోతున్నారని చెప్పారు.
ఇక, వైజాగ్ ఎయిర్‌పోర్టులో బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆశీర్వాదం తీసుకున్నారనే వార్త రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని.. వైసీపీ నాయకులే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం తనకు అనవసరమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అదంతా తెలుగుదేశం పార్టీ క్రియేషన్ అని విమర్శించారు. అభద్రతాభావంతోనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొండపల్లి శ్రీనివాస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు విజయనగరం వెళ్లి చూస్తే తాను చేసిన అభివృద్ధి ఏంటో కనిపిస్తుందని చెప్పారు.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, మక్కువ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్యప్రకాశ్ నకిలీ ఐపీఎస్‌గా అవతారమెత్తి పవన్ కల్యాణ్ బందోబస్తులో పాల్గొన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.