తనపై ఎలాంటి అక్రమాస్తులు లేవని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆఫ్రికాతో పాటు విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని ఆయన స్పష్టం చేశారు.
కాకాణితో తనకు మనస్పర్థలు ఉన్నాయని గతంలో అన్నారని.. ఇప్పుడేమో కాకాణితో కలిసి మైనింగ్ చేశానని అంటున్నారని తెలిపారు. మనస్పర్థలు ఉంటే ఆయనతో కలిసి ఎలా వ్యాపారం చేశానని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. 2008కి ముందున్న.. ఇప్పుడున్న ఆస్తులపై విచారణకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
గతంలో కంటే ఒక్కరూపాయి ఎక్కువ ఉన్నా శిక్షించండని అని స్పష్టం చేశారు. నా ఆస్తి వెయ్యి కోట్లు ఉంటుందని అంటున్నారని.. దీనిపై చంద్రబాబు విచారణ జరిపి రూ.950 కోట్లను అమరావతి అభివృద్ధికి తీసుకుని.. మిగతా 50 కోట్లను తనకు ఇస్తే చాలని చెప్పారు. దీనిపై చంద్రబాబుకు కూడా లేఖ రాస్తానని అన్నారు. క్వార్ట్జ్ మైనింగ్‌పై ఈడీ విచారణకు సిద్ధమని తెలిపారు. ఈ విషయంలో ఈడీకి కూడా లేఖ రాస్తానని తెలిపారు. కావాలంటే కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని చెప్పారు.