Ambati Rambabu | వరద ఉధృతికి తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా మాజీ సీఎం వైఎస్ జగన్కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని అంబటి రాంబాబు తెలిపారు. కానీ వైఎస్ జగన్ నిధులు కేటాయించకపోవడం వల్లే కొట్టుకుపోయిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్కు అంటగట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తప్పించుకోవడానికే జగన్పై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు పోయాయని తెలిపారు.
ప్రాజెక్టులపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. కాపర్ డ్యామ్ లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని అంటున్నారని తెలిపారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. నాడు సూపర్ సిక్స్ అని ఊదరగొట్టారని.. ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే బాబుకు భయమేస్తోందని ఎద్దేవా చేశారు. రెండున్నర నెలలకే కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. ఇప్పటికైనా చెప్పిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.