విశాఖ: వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని, ఆయన జ్ఞాపకంగానే వైసీపీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎందరో తొక్కేయాలని చూశారని, అయినప్పటికీ జగన్ నిలదొక్కుకుని ముఖ్యమంత్రిగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. స్వర్గీయ వైఎస్సార్ ఆలోచనలకు ప్రతిరూపంగానే నవరత్నాలను జగన్ ప్రవేశపెట్టారని వెల్లడించారు.
ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ పార్టీదేనని మంత్రి అవంతి చెప్పారు. మహిళలకు పెద్ద పీఠ వేస్తూ వారికి అనేక కీలక పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వం గ్రామస్థాయిలో ప్రజల ముంగిట చేరడం దేశ చరిత్రలో ఒక రికార్డ్ అన్నారు. ఎవరూ చేయని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నందునే ప్రజలు వైసీపీతో ఉంటూ అన్ని ఎన్నికల్లో నీరాజనం పడుతున్నారన్నారు.
సీఎం జగన్ పాలనలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పేర్కొన్నారు. సీఎం జనగ్ ఆలోచనల కారణంగానే గిరిజిన ప్రాంతాల్లో వైద్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మేయర్ హరివెంకట కుమార్ చెప్పారు. తెలుగు ప్రజల కోసం పదకొండేండ్ల క్రితం పుట్టిన వైసీపీ.. రెట్టింపు ఉత్సాహంతో విజయవంతంగా సాగుతున్నదన్నారు.