EVM | ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కడప జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2029లో జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయనని ప్రకటించారు.
బ్యాలెట్ పేపర్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేసినా ఫలితం ఉండదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 2024లో మోసం చేసినట్లే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని అనుమానం వ్యక్తంచేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. నాలుగు నెలల కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని.. ఈవీఎం మెషిన్లే శాసనం చేశాయని ఆరోపించారు. కౌంటింగ్ అయిన అరగంటకే ప్రజలు ఇదే విషయాన్ని ముక్త కంఠంతో చెప్పారని గుర్తుచేశారు.
గత ఎన్నికల్లు కూటమి పార్టీలు ఈవీఎంలలో అక్రమాలు చేసి గెలిచారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అన్నారు. ఈవీఎంలపై తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక విధానంలో నాయకులు ఎన్నిక అవుతారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ ద్వారా జరిపితేనే తాను పోటీ చేస్తానని లేదంటే పోటీ చేయనని స్పష్టం చేశారు.