తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు చేసిన మాటలు చాలా బాధ కలిగించాయని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూపై రాజకీయం తప్పని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని ఆయన తెలిపారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని అన్నారు. అయినా జూలైలో వచ్చిన రిపోర్టును సెప్టెంబర్‌లో బయటపెట్టారని చెప్పారు. జూన్‌లో కల్తీ నెయ్యి వస్తే ఇప్పటి ప్రభుత్వానిదే కదా బాధ్యత అని ప్రశ్నించారు.
శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. పవిత్రమైన లడ్డూపై అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సమంజసమేనా అని నిలదీశారు. చంద్రబాబుకే కాదు మాకు కూడా వెంకటేశ్వర స్వామి ఇలవేల్పే అని స్పష్టం చేశారు.