YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు. దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని టీడీపీ గుర్తించాలని హెచ్చరించారు.
వైసీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేత అజయ్‌పై దాడి చేయడం దారుణమని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేవని గుర్తుచేశారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఆయన పాపాలు కూడా పండుతున్నాయని చెప్పారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తు చేశారు. అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకే చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలని హెచ్చరించారు. ఈ సంస్కృతిని ఆపేయాలని చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా అని.. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైసీపీ శ్రేణులపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ఓటు వేశాడని అజయ్ కుమార్ రెడ్డిని రోడ్డుపై ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టారే.. ఏం సాధిద్దామని?
పులివెందుల్లో ఇప్పటి వరకు ఇలాంటి దాడి సంస్కృతి లేదు. కానీ కొత్తగా @JaiTDP వాళ్లు దాడి సంప్రదాయానికి రాష్ట్రవ్యాప్తంగా బీజం వేస్తున్నారు
ఆపేయమని @ncbn కి… pic.twitter.com/SCqDUYeRJ5
— YSR Congress Party (@YSRCParty) July 6, 2024
చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని జగన్ అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులపై దాడులపై కాకుండా ఇచ్చిన హామీల మీద దృష్టి సారించాలని చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి సూచించారు. నాయకులుగా ఉన్న మనం ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవుపలికారు.