AP News | టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఓ విజయోత్సవ సభలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ మండలానికో ఇద్దరిని పీకండి.. ఏమైనా కేసులైతే నేను చూసుకుంటా. ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా’ అని ఆ మీటింగ్లో అన్నారు. ఈ వీడియోను వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఆ హామీతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నంద్యాలలో వైసీపీ కార్యకర్త పెద్ద సుబ్బరాయుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా మీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే మాటలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసింది.
‘‘మండలానికి ఇద్దరిని చంపండి.. ఏవైనా కేసులైతే నేను చూసుకుంటా. ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా’’ ఇదీ ఓ పబ్లిక్ మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు
ఆ హామీతో రెచ్చిపోయిన @JaiTDP గూండాలు నంద్యాలలో వైయస్… pic.twitter.com/gY643Eqyti
— YSR Congress Party (@YSRCParty) August 10, 2024
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవ సభ పెట్టి మరీ.. ‘ మండలానికి ఇద్దరు వైసీపీ నాయకులను చంపండి.. నేను చూసుకుంటా అని అంటున్నాడు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను అందరికీ వినిపించిన జగన్.. స్థానిక ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి చంపమని చెబుతుంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ బతకాలంటే.. ఈ దాడులు ఆగాలంటే చంపినవాళ్లపై మాత్రమే కాదు.. చంపిన వాళ్లను రక్షిస్తున్న వారిని కూడా జైల్లో పెట్టాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చేయి జారకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ అన్యాయాలపై కలిసికట్టుగా పోరాడతామని ప్రజలు, మీడియాను ఆయన కోరారు. చంపిన వాళ్లనే కాకుండా వాళ్లను చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్న నారా లోకేశ్, నారా చంద్రబాబును కూడా ముద్దాయిగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ అర్డర్ బతకదని స్పష్టం చేశారు.