YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమితో చనిపోయిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ నాయకులతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వై నాట్ 175 అంటే కేవలం 11 సీట్లలో మాత్రమే గెలిచి.. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఎక్కడ మోసం జరిగిందనేది అర్థం చేసుకునేందుకు, ఓటమికి గల కారణాలపై.. జగన్తో పాటు వైసీపీ కీలక నేతలు విశ్లేషణలు జరిపారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టిన జగన్ వైసీపీ నేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందర్ని ఈ సమావేశానికి ఆహ్వానించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఓదార్పు యాత్ర కారణంగా కిందిస్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది.