అమరావతి : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైసీపీ(YCP) పక్షానికి ఊపిరి సలపనివ్వడం లేదు. గత 5 నెలలుగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కనీసం పీఏసీ చైర్మన్‌గా ( PAC elections ) నైనా అవకాశం వస్తుందని ఊహించారు. కాని అందుకు భిన్నంగా ప్రభుత్వం వైసీపీ డిమాండ్లను ఖాతరు చేయడం లేదు.
తాజాగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ (Chairman) పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వైసీపీకి వస్తుందని ధీమాలో ఉండి నిన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy) పీఏసీ చైర్మన్‌గా నామినేషన్ వేశారు. వాస్తవానికి పీఏసీలో 12 మంది సభ్యులకు గాను 9 ఎమ్మెల్యేలు, 3గురు ఎమ్మెల్సీలు ఉంటారు.
అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న 164 మంది మెజారిటీ ఉండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో నామినేషన్ వేయించడంతో వైసీపీ కంగుతిన్నది. ఇరుపార్టీల నుంచి పోటీ నెలకొనడంతో శుక్రవారం అసెంబ్లీ హాల్లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన సభ్యులు అక్కడి పరిస్థితిని చూసి ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ హయాంలో సభ్యుల సంఖ్యతోసంబంధం లేకుండా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చామని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటింగ్‌ను బహిష్కరించగా కూటమిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.