Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు వైసీపీ తరఫున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏపీలో శాంతి భద్రతల లోపంతో పాటు పాలనా వ్యవహారాలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం లేదు.. హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు మామూలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేస్తే రాజకీయం తప్ప, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను బాధతో, బాధ్యతతో ఈ విషయాలు మాట్లాడుతున్నానని, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పారు.
ప్రతి సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నిమిత్తమాత్రుడిని అని ముఖ్యమంత్రి చెబితే.. కస్టోడియన్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యత లేని, గవర్నమెంట్‌ను నేనుఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఘటనలకు బాధ్యులు ఎవరని నిలదీశారు. ముఖ్యమంత్రికి చేతకాకపోతే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సలహాలు అడగాలని సూచించారు.
ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని, ప్రభుత్వానికి అవగాహన లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తుపాన్ వంటి విపత్తుల సమయంలో కూడా ముఖ్యమంత్రి కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని పనికిమాలిన కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.