Srisailam | శ్రీశైల మహా క్షేత్రం పరిధిలో దేవస్థానం ప్రాచీన విగ్రహాల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా క్షేత్ర పరిధిలో పలు చోట్ల గల దేవతా విగ్రహాలను సేకరిస్తున్నారు. స్థానికుల సూచనల మేరకు విభూతి మఠం వద్ద గల అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉద్యానవన కార్యాలయంలో భద్రపరిచారు. కార్యాలయ భవనంలోని సహాయ స్థపతి వారి గదిలో గల అపరాజితా దేవి పాత విగ్రహాన్ని.. ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు కింద లోక కల్యాణం కోసం నెలకొల్పారు. అపరాజితా దేవి విగ్రహాన్ని జమ్మి చెట్టు కింద నెలకొల్పడం శ్రేయస్కరమనే భావనతో దేవస్థానం సహాయ స్థపతి పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో నెలకొల్పారు.
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం అపరాజితా దేవి విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద స్వామి, ఉప ప్రధాన అర్చకులు బీవీఎస్ శాస్త్రి, ఇతర అర్చక బ్రుందం ఈ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ ఈఓ ఐఎన్వీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు ఈ పూజాధికాలు నిర్వహించారు. రాష్ట్రం సర్వతోముఖాభివ్రుద్ధి చెందాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, అతివ్రుష్టి, అనావ్రుష్టి నివారించాలని, పాడి పంటలు సమ్రుద్ధిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, భక్తులందరికీ శ్రేయస్సు కలగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని పూజాధికారులు నిర్వహించారు. తదుపరి చంద్రవతి కల్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు.