తిరుమల : తిరుమల(Tirumala) లోని బాలాజీ నగర్ వెనుక భాగంలో ఉన్న కార్మికుల నివాసాలపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు(Vigilence Officers) ఆదివారం దాడులు నిర్వహించారు. తిరుమలలో వివిధ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసిన కార్మికుల కోసం తాత్కాలిక షెడ్ల(Sheds) ను వారి నివాసం కోసం టీటీడీ (TTD) ఏర్పాటు చేసింది.
పనులు పూర్తయి, కాంటాక్టర్ వెళ్లిపోయినప్పటికీ, ఇప్పటికీ 70 కి పైగా షెడ్లలో కార్మికులు తిరుమలలో ఉంటున్నారు. ఇందులో కొంతమంది అనధికార వ్యక్తులు కూడా ఉండడంతో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్ ఆదేశాల మేరకు టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది (Security) స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించారు.
తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన కార్మికుల జాబితాను తయారు చేసి ధృవీకరణ కోసం ఇంజినీరింగ్ విభాగానికి పంపారు. అనధికారికంగా ప్రవేశించే వారిని నిలువరించేందుకు ఇకపై ఇలాంటి దాడులు నిరంతరాయంగా కొనసాగిస్తామని అధికారులు వివరించారు. తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వ్యక్తులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.