అమరావతి: కొత్త జిల్లాల పేర్లు పెట్టే విధానంలో వైసీపీ సర్కారు అనుసరించి తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో ఒక్కదానికైనా అంబేడ్కర్ పేరు పెట్టక పోవడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. కొత్త జిల్లాలకు పేర్లు సిద్ధం చేస్తున్న సమయంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు ప్రభుత్వ పెద్దలకు గుర్తుకు రాకపోవడం శోచనీయమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే దళిత బిడ్డ బాలయోగి పేరును తొలగించారని చంద్రబాబు విమర్శించారు. ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఒక్క జిల్లాకైనా బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తే.. దానికి దళిత తేజం జీఎంసీ బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలకు ఉన్న దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ఎనలేని కృషి చేసిన ఆయన పేరును తొలగించడం బాలయోగిని అవమానించడమే అని చంద్రబాబు అన్నారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాల పేరు తొలగించి అంబేడ్కర్ పేరు పెట్టొచ్చునని సూచించారు.