అమరావతి : వైసీపీ హయాంలో అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను ( Registered houses ) రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan ) ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, వాటిని లాక్కొవడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వమని మండిపడ్డారు. మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యిందని ఆరోపించారు.
మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని విమర్శించారు. కాని తాము వారి సొంతింటి కలను నిజం చేసేలా ‘ పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద 71. 8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించామని, ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు . ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు తమ ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడించారు.
వైసీపీ హయాంలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా? అంటూ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చి 16, 17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు సున్నా అని వ్యాఖ్యనించారు. చెత్తగా పరిపాలిస్తూ పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కొవడం దుర్మార్గమని, దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. పేదలకొరకు అవసరమైతే న్యాయపోరాటాలు చేస్తామని, వారికి అండగా నిలబడతామని అన్నారు. ఈ విషయంలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.