అమరావతి : ఏపీలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu ) మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. పోలవరం ( Polavaram ) ఏపీకి జీవనాడి లాంటిదని, అది పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని సోమవారం మంత్రులు, అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
ఎగువ నుంచి వదిలిన నీరు పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. నల్లమలతో ఎవరికీ నష్టం ఉండదని, రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. పోలవరంలో మిగిలిన నీటిని తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశముందని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడే అడ్డుచెప్పలేదని మరోమారు గుర్తు చేశారు. విశాఖ ఉక్కును కేంద్ర సహాయంతో కాపాడుకున్నామని , ఈ ప్లాంట్‌ను నిలబెట్టి తీరుతామని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కూటమి పాలన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.