అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే లడ్డూ తయారిలో కల్తీ జరుగడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మీడియాతో శనివారం మాట్లాడారు. శ్రీవారికి నైవేద్యం పెట్టే లడ్డూ (Laddi) తయారీలో రివర్స్ టెండర్లపై (Reverse Tenders) అనుమానం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల (Tirumala) ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పానని స్పష్టం చేశారు. ప్రక్షాళన చేయమంటే అన్నీ పనులు చకాచకా చేసేశారని పేర్కొన్నారు. లడ్డూ నాణ్యత పెంచేందుకు పలు కంపెనీలను ఈవో బ్లాక్‌లిస్టులో పెట్టారని వెల్లడించారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు రోజూ బయటకొచ్చి చెప్పలేరని, ఈవో తన పనిచేసేశారని వివరించారు.
టీటీడీ విషయంలో ఎలా చేయాలనేది చర్చిస్తున్నామని, జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చిస్తామని చంద్రబాబు వెల్లడించారు. సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తామని, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పరీక్షలు, సంప్రోక్షణ చేపడతామని అన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని జగన్‌ను ప్రశ్నించారు. తన ఇంట్లో తిరుమల సెట్ వేసుకున్న జగన్‌ను ఏమనాలని విమర్శించారు. ఆచారాలు, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.