అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ పీఆర్సీలోని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా , చలో విజయవాడలో బల ప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుందని తెలిపారు. సమస్యను మరింత జఠిలం చేసేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు సమస్య పరిష్కరించుకునే ఉద్దేశ్యం లేదని, వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని వెల్లడించారు. సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని అన్నారు. కొవిడ్ నుంచి కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో తెలియదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంచి ప్యాకేజీ ఇచ్చామని పీఆర్సీ నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే అసంతృప్తి వ్యక్తమవుతుందని వివరించారు. సక్రమంగా జీతాలు రాక, అతి తక్కువ వేతనంతో పనిచేసిన పొరుగుసేవలు, అంగన్వాడీ ఇతర శాఖల వారికి వేతనాల పెంపుతో పాటు నెలవారీగా ఠంఛనుగా జీతాలు ఇస్తున్నామని సజ్జల పేర్కొన్నారు.
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని సంక్షేమానికి దోచి పెడుతున్నా మనడంలో అర్థం లేదని అన్నారు. ముఖ్యమంత్రిపై అభండాలు వేయడం సరైనది కాదని అన్నారు.