హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : పీఎం సూల్, సమగ్ర శిక్షా పాఠశాలల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, వ్యక్తిగత హోదాలో జాయింట్ డైరెక్టర్ వెంకటనరసమ్మ కౌంటర్లు దాఖలు చే యాలని ఆదేశించింది. పీఎం సూల్, సమగ్ర శిక్షా పాఠశాలల ఏర్పాటుకు భాగస్వామ్య సంస్థల ఎంపికలో అవకతవకలపైన, పీఎం సూల్, సర్వశిక్షా అభియాన్ పథకాల్లో జరిగిన కుంభకోణం, నిధుల దుర్వినియోగంపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
వృత్తివిద్యా కోర్సులకు భాగస్వాముల ఎంపికలో భాగంగా బిడ్డర్ల నుంచి అధికారులు కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని కేటాయింపులు చేశారని, 2024-25 ఏడాదికి బిడ్డింగ్‌లను నిలిపివేశారని ఒక న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ‘రాష్ట్ర ప్రభుత్వం 946 పాఠశాలల ఏర్పాటుకు బిడ్లను పిలువగా, 500 బిడ్లకు ఆమోదం లభించింది. ముడుపులు ఇచ్చిన వారికి బిడ్ కేటాయింపులు జరిగాయి. బిడ్ రూల్స్ ఉల్లంఘన జరిగింది. సింగిల్ బిడ్ మాత్రమే వస్తే వాటిని అధికారులు ఆమోదించారు. జేడీ వెంకటనరసమ్మ బిడ్డర్ల నుంచి ముడుపులు డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగింది’ అని న్యాయవాది తన లేఖలో ఆరోపించారు. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.