అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గత ప్రభుత్వాన్ని ఆగమాగం చేసిన వాలంటీర్ వ్యవస్థ (Volunteer system) పై కొత్త మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఒకసారి, వారిని తొలగిస్తామని మరొకరు రకరకాలుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ఈ దశలో మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmal Ramanaidu) వాలంటీర్ వ్యవస్థపై స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అనే అంశాన్ని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
వైఎస్ జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని గ్రామాలు, పట్టణాల్లో వాలంటీర్లను నియమించి వారి ద్వారా పెన్షన్లు ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అధికార వైసీపీ(YCP) కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాలంటీర్లపై టీడీపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది.