అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించిన విషయంపై మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetty Subhash) స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నమోదులో పార్టీ వెనుకంజ ఉండడంపై చంద్రబాబు (Chandra Babu) రెండు రోజుల క్రితం ఆయా జిల్లాల నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యత నమోదులో వెనుకబడ్డ ఉభయ గోదావరి జిల్లాల నాయకుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ను మందలించిన ఆడియో(Audio) వైరల్ అయ్యింది. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకయ్యా అంటూ చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీరు మొదటిసారి గెలిచినా పార్టీ ఎంతో గౌరవించింది. ఎమ్మెల్యే సీటు ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇచ్చింది. అయినా పట్టుదల లేకపోతే ఎలా? మీరు సరిగ్గా పనిచేయకపోతే నేను ప్రత్యామ్నాయం చూస్తాను. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకు అంటూ ఘాటుగానే మంత్రిని హెచ్చరించారు.
ఈ విషయంపై మంత్రి సుభాష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని తనను ఎమ్మెల్యేగా గెలిపించి, అత్యున్నత మంత్రిని చేసి సామాజిక వర్గాన్ని చంద్రబాబు గౌరవరించారని అన్నారు. విధుల్లో అలసత్వం వహించినందుకే తండ్రిలాగా తనను మందలించారని పేర్కొన్నారు.
తన అలసత్వాన్ని అంగీకరించి, తప్పులను సరిదిద్దుకుంటానని పేర్కొన్నారు. తమ నాయకుడు చంద్రబాబు మందలింపులో అపార్థాలకు తావు లేదని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ కోసమే టీచర్లు, తల్లిదండ్రులు బెదిరిస్తారని , ఇకపై తనలో అలసత్వం ఉండదని వెల్లడించారు.