అమరావతి : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో రూ. 160 కోట్లతో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్ఐడీఎం), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) 10వ బెటాలియన్ కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కంకణబద్దులై ఉన్నారని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణానికి 27 వేల కోట్లను హడ్కో, ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణాలుగా అందించారని తెలిపారు. విశాఖ స్టీల్ కర్మాగారానికి (Visaka Steel Plant) ఇటీవల రూ.11,440 కోట్లను మంజూరు చేశారని వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు మంజూరు చేసినందున 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పోలవరం జలాలు అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో గ్రీన్ పార్కు నిర్మాణానికి రూ. 2లక్షల కోట్లతో పెట్టుబడులతో పనులు ప్రారంభించారని వివరించారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా పట్టాలెక్కించామని ఆయన అన్నారు. దేశంలో ఉన్న జాతీయ విపత్తు బృందం సమర్దవంతంగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్, తుర్కియే తదితర దేశాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందని అన్నారు .
ఏపీ ఎన్నికల్లో కూటమికి అనూహ్య విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.