అమరావతి : ఏపీలో మెడికల్ కళాశాలలను ( Medical College ) ప్రైవేట్‌పరం చేయనున్న కూటమి సర్కార్‌కు అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గుణపాటం చెబుతామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) హెచ్చరించారు. మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యత తీసుకునే వారిని రెండు నెలల్లో జైలుకు ( Jail ) పంపుతామని స్పష్టం చేశారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులు తాడేపల్లికి చేరుకున్నాయి. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11,136 మంది సంతకాల ప్రతులను గురువారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో జగన్ మాట్లాడారు.
పేద, మద్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఉచిత వైద్యం అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పెద్ద కుంబకోణమని, ఈ విషయంలో కోర్టులో అఫిడవిట్ వేస్తామని వెల్లడించారు. ప్రైవేట్ వారికి మెడికల్ కాలేజీలను అప్పగించి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
విద్యను, ఆర్టీసీని, పోలీసు వ్యవస్థను ప్రైవేటీకరణకు కూటమి ఆలోచిస్తుందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలను నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం పేదలకు బటన్ నొక్కి అందజేశామని అన్నారు. రెండు సంవత్స రాలుగా కూటమి ప్రభుత్వం వల్ల ఒక్క మేలు జరుగలేదని పేర్కొన్నారు. ఉన్న పథకాలను రద్దు చేయడంతో పాటు సూపర్ సిక్స్‌తో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ఆరోపించారు.