అమరావతి : అమరావతి (Amaravati) నిర్మాణాలపై శ్వేతపత్రం(White Paper) విడుదల చేస్తామని, రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు(Chandra Babu) అన్నారు. గురువారం అమరావతిలోని భవనాలను పరిశీలించిన అనంతరం సీఆర్డీయే కార్యాలయంలో మాట్లాడారు.
రాజధాని కోసం ఈ ప్రాంత రైతులు 1,631 రోజుల పాటు ఆందోళన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజధాని ఏ ఒక్కరి కోసం కాదని, భావితరాల భవిష్యత్ కోసమని తెలిపారు. గత వైసీపీ (YCP) పాలకులు పట్టించుకోకపోవడంతో టీడీపీ హయాంలో చేపట్టిన భవనాలన్నీ కూడా అసంపూర్తిగా ఉండిపోయాయని వెల్లడించారు. భవనాల నిర్మాణాల కోసం తెచ్చిన మెటీరియల్ను అల్లరిమూకలు దొంగిలించుకుపోయారని ఆరోపించారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందని అన్నారు.
పోలవరాన్ని(Polavaram) వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసిందని దుయ్యబట్టారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అభివర్ణించారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం లభిస్తుందని అన్నారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలు సిటీని ఆధునిక సిటీ నగరంగా తీర్చిదిద్దుతామని హామి ఇచ్చారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆనాడే ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఐదేండ్ల వైసీపీ పాలనలో విధ్వంసం కొనసాగిందని అన్నారు.
రాజధాని విధ్వంసకారుల ఆటలు సాగనివ్వం..
రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు యత్నించిన వారి ఆటలు ఇక సాగవని చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దాడులు, రౌడీయిజానికి పాల్పడే వ్యక్తులు, ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిని నిర్మోహమటంగా అణిచివేస్తామని స్పష్టం చేశారు.