అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడికి ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram) ఎత్తును తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందని వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్ (YCP) అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash chandra Bose ) మీడియాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్ల ఎత్తుకు కేంద్రం తగ్గిస్తుందన్న వార్తల మేరకు వైసీపీ ఎంపీలంతా పార్లమెంట్లో ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు.
దీంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను , ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ అండ్ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేత విషయంలో ఆందోళన నెలకొని ఉందని అన్నారు. పరిహారం ఖచ్చితమైన తేదీని ఏపీకి విడుదల చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.