అమరావతి : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ట్రావెల్ బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ (High-level committee) వేసి విచారణ జరిపిస్తామని ఏపీ మంత్రులు అనిత ( Minister Anitha ) , మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ( Ramprasad Reddy ) వెల్లడించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని, ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను వారు పరామర్శించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఘటనపై విచారణలో భాగంగా ఏర్పాటు చేసే కమిటీలో పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులుంటారని వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారని వివరించారు. ప్రమాదం నుంచి 27 మంది బయటపడ్డారని తెలిపారు.
మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయని, మృతదేహాలు గుర్తించేందుకు బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రమాదంపై 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిందితులందరిపై చర్యలు ఉంటాయని, ఇప్పటికే కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అనిత వెల్లడించారు.
బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మృతుల్లో కోనసీమ, నెల్లూరు , బాపట్ల జిల్లాల వాసులున్నారని తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న 42 మందిలో 19 మంది సజీవదహనమయ్యారు. మిగతా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు.