తిరుమల : యుద్ధాలతో సాధించేది ఏమి లేదని, శాంతి ( Peace ) మార్గమే అందరికి శరణ్యమని గణపతి సచ్చిదానంద స్వామి ( Ganapathi Satchidananda Swamy ) అన్నారు. బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంతకుముందు సచ్చిదానంద స్వామిని ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలపూర్వకంగా స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో తీర్ధప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల ఉపయోగాలు లేవని అన్నారు. యుద్ధాల వల్ల అందరికి బాధ కలుగుతుందని, అనేక రకాలుగా నష్టాలు వస్తాయని అన్నారు. యుద్ధాలు చేస్తున్న వారికి సద్భుద్ధి ఇవ్వాలని, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల సంక్షేమానికి పనిచేయాలని, యుద్ధాల కోసం కాదని హితవు పలికారు. వేంకటేశ్వరుడికి ఇష్టమైన గోవులను రక్షించాలని, వాటికి ప్రతిరోజు ఆహారం ఇవ్వాలని కోరారు.