Ambati Rambabu | సోషల్‌మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు ఎమ్మెల్యేలను లాగేసుకుని వైఎస్ జగన్‌ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసి చంద్రబాబు భంగపడ్డారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ సోషల్‌మీడియాను బయపెట్టాలని కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు మళ్లీ భంగపాటు తప్పదని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా సరే వైసీపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు.
గుంటూరు జైలులో ఉన్న వైసీపీ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌లు మేక వెంకట్రామిరెడ్డి, కళ్లం హరికృష్ణ రెడ్డి, పానుగంటి చైతన్యను పేర్ని నాని, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వర్రా సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారని మండిపడ్డారు. వర్రా రవీందర్ రెడ్డిని అర్ధరాత్రి ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఏపీలో పౌర హక్కులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబసభ్యులపై ఐటీడీపీ సోషల్‌మీడియాలో చాలా దారుణంగా పోస్టులు పెడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లే ఫేక్ అకౌంట్లతో అక్రమ పోస్టింగ్‌లు పెడుతున్నారని తెలిపారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. చట్టాన్ని పాటించకపోతే సర్వనాశనమవుతారని హెచ్చరించారు. వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదే విషయమై తొందరలోనే సుప్రీంకోర్టు, రాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.