Gudivada Amarnath | తమపై కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆరోపణలు రాజకీయంగానే ఉపయోగపడుతాయని తెలిపారు. కానీ వాటిని రుజువు చేయాలంటే ఆధారాలు కావాలని చెప్పారు.
మాపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని కూటమి పార్టీలపై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో 25 వేల కిలోల డ్రగ్స్‌తో ఓ కంటైనర్ వైజాగ్‌కు వచ్చిందని తప్పుడు ప్రచారం చేశారని గుర్తుచేశారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బతీయడానికి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. అధికారం కోసం నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. కానీ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని సీబీఐ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారని తెలిపారు.
ఆపరేషన్ గరుడ పేరుతో వైజాగ్ కంటైనర్‌పై సీబీఐ అధికారులు విచారణ చేశారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కంటైనర్ షిప్‌పై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆ కంటైనర్ విషయంలో తమపై టీడీపీ నాయకులు తప్పుడు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని చెప్పడానికి సీబీఐ అధికారులకు 8 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తప్పుడు కేసులకు పారిపోవాల్సిన అవసరం తమకు లేదని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రతిరోజూ ప్రజల ముందుకు వస్తూనే ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ తమపై లుక్అవుట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.