హైదరాబాద్: ఎగువనుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతున్నది. దీంతో డ్యామ్ క్రమంగా నిండుతున్నది. సుకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకుగాను ఇప్పుడు179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో నేడో రేపో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
మరోవైపు జలాశయం పదో నంబర్ గేటు వద్ద పెద్దఎత్తున వాటర్ లీకేజీ అవుతోంది. గత నెలలో అధికారులు ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించి రబ్బర్ సీల్స్ మార్చారు. అయినప్పటికీ భారీగా నీరు లీకవుతున్నాయి. సుమారు కోటి 30 లక్షలు నిధులు వెచ్చించి మరమ్మతులు చేసినా నీళ్లు కిందికి పోతుండటం గమనారహం. జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని ఆరోపణలు వినవస్తున్నాయి.