తిరుపతి : కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. మార్చి 30న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ , 31న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు.
శ్రీ కోదండరామ స్వామి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీని ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకువసతి ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఆలయం, కల్యాణ వేదిక వద్ద భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు చేయాలన్నారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన ఉమామహేశ్వరి దంపతులు ఎస్వీబీసీ ట్రస్టుకు శుక్రవారం రూ. 10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.