Viveka Murder Case | తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఊరటనిచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై మంగళవారం సైతం వాదనలు వాడీవేడీగా సాగాయి. అయితే, ముందస్తు బెయిల్‌కు అనుమతించిన కోర్టు.. 25వ తేదీ వరకు ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అవినాష్‌రెడ్డి విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు సూచించిన కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 25న తుది తీర్పును వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్‌పై సీబీఐతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, సునీతారెడ్డి న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీబీఐ బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. అయితే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ఎందుకు తొందరపడుతుందని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు.
మరో వైపు వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇటీవల ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో కస్టడీ కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు ఆరు రోజులు నిందితుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.