Viveka Murder Case | కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై భోజన విరామం తర్వాత హైకోర్టలు వాదనలు మరోసారి జరిగాయి. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపింది. గతంలో నాలుగు విచారణల్లో సహకరించలేదని పేర్కొంది. వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్ రెడ్డికి ముందే తెలుసునని చెప్పింది. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించామని కోర్టుకు తెలిపింది. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలని స్పష్టం చేసింది. హత్య రోజు ఎంపీ జమ్మలమడుగు దగ్గరలో ఉన్నట్లు చెప్పారని, ఇంట్లోనే ఉన్నట్లుగా మొబైల్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తుందని చెప్పింది.
వివేకా హత్య రోజు రాత్రంతా ఫోన్‌ను అసాధారణంగా వాడారని, హత్యకు ముందు.. తర్వాత ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డికి ఉదయ్, జయప్రకాశ్‌రెడ్డితో సంబంధాలపై తేలాలని పేర్కొంది. అయితే, రాజకీయ కారణాలతో కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, అవినాష్‌రెడ్డికి ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ వాదించింది. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేయడంలో అవినాష్‌రెడ్డిది కీలక పాత్ర అని, దాదాపు రూ.40కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించినట్లు సీబీఐ వాదించింది.
మరో వైపు ఈ కేసులో సునీతారెడ్డి తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సునీతారెడ్డి, అవినాష్‌రెడ్డి లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దస్తగిరి మీడియాతో మాట్లాడిన దాన్ని సునీత లాయర్ సమర్థించడమేంటని అవినాష్‌రెడ్డి తరఫు లాయర్ ప్రశ్నించారు. దస్తగిరిని సమర్థించారననడం అర్థరహితమని సునీత లాయర్ అన్నారు. అవినాష్‌రెడ్డి కుటుంబం ప్రమేయం లేకుండా హత్య జరిగే అవకాశం లేదని శివశంకర్‌రెడ్డి చెప్పారని సునీతారెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గంగాధర్‌రెడ్డి స్టేట్మెంట్ సైతం అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలో సీబీఐ విచారణ జరిగిన సమయంలో అవినాష్‌రెడ్డి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసులో విచారణ కోసం ఇవాళ 4 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవినాష్‌రెడ్డి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.