Srisailam | శ్రీశైలం : లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ కృత్తికా నక్షత్రాన్ని సందర్భంగా ఆదివారం శ్రీశైల క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలు చేశారు. ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజుల్లో స్వామివారికి ఈ విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తూ వస్తున్నది. కుమారస్వామివారికి పూజలు చేయడం వల్ల లోకకల్యాణంతో పాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయని భక్తుల నమ్మకం.
సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయని.. సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. అభిషేకానికి ముందుగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్వఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణలు చేశారు. అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. పౌర్ణమి, మూలా నక్షత్రం, ఆదివారం రోజుల్లో దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు చేశారు.