Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ప్రధాన ఆయలంలోని వీరభద్రస్వామికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న మల్లికాగుండం పక్కనే వీరభద్రస్వామి జ్వాలామకుటం పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తారు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి పేరు సైతం ఉన్నది. స్వామివారికి పక్కనే దక్షప్రజాపతి కనిపిస్తారు. ఈ స్వామిని పరివార ఆలయాల్లో భాగంగా నిత్యపూజలు నిర్వహిస్తుంటారు. బుధవారం ప్రదోషకాలంలో దేవస్థానం ఆధ్వర్యంలో విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం వీరభద్రస్వామికి పంచామృతాలు, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ, మల్లికాగుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పుష్పార్చన జరిపించారు.
ధర్మపథంలో భాగంగా దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదికపై నిర్వహించిన నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది. సికింద్రాబాద్కు చెందిన వేంకటేశ్వర నృత్యనికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శన సాగింది. కార్యక్రమంలో మూహికవాహన, శివతాండవం, ఓం నమఃశివాయా, అఖిలాండేశ్వరి, దేవీస్తుతి తదితర గీతాలకు లాస్య, గౌతమి, వేదశ్రీ, భవిష్య, సహస్ర, నిత్యశ్రీ, సంయుక్త, సమీక్ష, సాహితి, శ్రీవర్షిణి నత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు.
శ్రీశైల దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన శివ చతుసప్తాహ భజనలు బుధవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలోని వీరశిరో మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులకు విశేష పూజలను జరిపించినట్లు ఏఈవో తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమై భాద్రపద శుద్ధ పాడ్యమితో ముగుస్తాయి. మల్లికార్జున స్వామివారికి వీరశిరోమండపంలో నిరంతరాయంగా రేయింబవళ్లు అఖండ శివ పంచాక్షరి నామ భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలుకు చెందిన ఐదు భజన బృందాలు, కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాల వారికి మాసాంతం భజనలు చేయడానికి అవకాశం కల్పించారు.