విశాఖపట్నం: అగ్నిపథ్ ఆందోళనలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి వ్యాపించాయి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్లపై దాడి జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు విశాఖ రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ముందుజాగ్రత్తగా గోదావరి, గరీబ్‌రథ్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను దువ్వాడ, అనకాపల్లిలో నిలిపివేశారు. ప్రయాణికులు అక్కడే దిగి విశాఖ వెళ్లాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.
గుంటూరు గరంగరం
గుంటూరు జిల్లాలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆర్మీ అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు. రైల్వే స్టేషన్ వైపు దూసుకొస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయవాడ నుంచి వచ్చే రైళ్లను అధికారులు దువ్వాడ వద్ద నిలిపివేస్తున్నారు. హౌరా నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద దారిమళ్లించారు.