అమరావతి : ఉమ్మడి విశాఖపట్నం (Visakapatnam) స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడే అవకాశముందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లోనూ మెజారిటీ లేకపోయినా ప్రలోభాలు, బెదిరింపులు, కుట్రలతో గెలిచేందుకు చేసే ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
విశాఖ జిల్లాలో వైసీపీకి భారీ మెజార్టీ ఉందని పేర్కొన్నారు. గెలువలేమని తెలిసినా కూడా చంద్రబాబు(Chandrababu) అభ్యర్థిని నిలబెడుతారని అన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాల మేరకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
వైసీపీకి చెందిన విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డ ఆయనపై వైసీపీ అధిష్టానం ఫిర్యాదుతో మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
ఆగస్టు 6న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ, ఆగస్టు 13 వరకు నామినేషన్లకు ఆఖరు గడువు , 14న పరిశీలన, 16న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల అధికారులు వివరించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక, సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు