తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 30న ఉగాది( Ugadi ) ఆస్థానాన్ని టీటీడీ (TTD) వైభవంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా మార్చి 25న మంగళవారం ఉదయం 6 నుంచి11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ అధికారులు వివరించారు. . ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని వివరించారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని టీటీడీ అధికారులు వివరించారు.
అనంతరం ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి , భక్తులకు దర్శనానికి అనుమతిస్తారని చెప్పారు. ఈ కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు ( VIP Break Darshans) , అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసినట్టు వెల్లడించారు. 24న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు.