తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో ఈనెల 12 న ఒకరోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ( VIP Break Darsan ) రద్దు చేశారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Tirumanjanam) నిర్వహించనున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు.
ఈ కారణంగా సెప్టెంబర్ 11న వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి భక్తులు బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెను లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న 58,855 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,0174 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.65 కోట్లు వచ్చిందన్నారు.