Vijawada Durga Temple | తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని, ల్యాబ్ నివేదికల్లో స్పష్టమైందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సైతం నాణ్యత పరీక్షల్లో విఫలమైన కంపెనీకి నోటీసులు జారీ చేసింది. తాజాగా విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే సరుకులు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదని గుర్తించారు.
ఈ క్రమంలోనే సోదాలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 1110 కిలోల జీడిపప్పు, 700 కిలోల కిస్మిస్లు, లారీ లోడ్ శెనగపప్పుని అధికారులు వెనక్కి పంపారు. అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్మిస్లను వినియోగిస్తుంటారు. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే ఆవు నెయ్యి, బెల్లం, శెనగపప్పు శాంపిల్స్‌ను అధికారులు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేందుకు 14 రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో దుర్గగుడి స్టోర్స్ సహా అన్నదానం, ప్రసాదం తయారీ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చర్చ కొనసాగుతుండగా.. తాజాగా విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.