Maoists | ఏపీలోని విజయవాడ శివారులో అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురిని బుధవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికి విజయవాడ కోర్టు డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో నలుగురు మావోయిస్టులను నెల్లూరు జైలుకు తరలించారు.
ఆపరేషన్ కగార్ కొనసాగుతుండటంతో.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నుంచి పలువురు మావోయిస్టులు ఏపీని కేంద్రంగా చేసుకునేందుకు ప్లాన్ వేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో సహా ఆరుగురు మృతిచెందారు. అదే సమయంలో విజయవాడతో పాటు కృష్ణా, ఏలూరు, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని తెలిసి తనిఖీలు నిర్వహించారు. భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మాను( Hidma) పట్టుకుని చంపా మనడంలో వాస్తవం లేదని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్రా లడ్డా ( Intelligence ADG Ladda) పేర్కొన్నారు. అల్లూరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లోనే హిడ్మా చనిపోయాడని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా,కృష్ణా జిల్లా, ఏలూరు, కాకినాడ , కోనసీమ జిల్లాల్లో మంగళవారం మావోయిస్టుల అరెస్టులు జరిగాయని తెలిపారు. గాలింపులో మొత్తం 50 మందిని అరెస్టు చేశామని అన్నారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గాలింపులు,ఎదురుకాల్పులు జరుగుతుండడంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు మకాం మారుస్తున్నారనే ఇంటలిజెన్స్‌కు పక్కా సమాచారం కొన్ని రోజులుగా ఏపీ పోలీసులతో నిఘా వేసి ఉంచామని వెల్లడించారు. ఇందులో భాగంగానే అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారని పేర్కొన్నారు.