Srisailam | శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు శాస్త్రోక్తంగా వార పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామికి ప్రదోషకాలంలో అభిషేకంతోపాటు అర్చనలు నిర్వహించారు.
ఆరు బయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే వీరభద్రస్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో నంది మండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పం పఠించారు.
పంచామృతాలు, ఫలోదకాలతోపాటు మల్లికా గుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తర శతనామ పూజలు జరిపి నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అలాగే క్షేత్రపాలకుడు బయలు వీరభద్ర స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
కార్తీకమాసం తొలి సోమవారం రాత్రి వరకు క్షేత్రానికి చేరుకున్న యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడాయి. వరుస సెలవుదినాలతోపాటు సోమవారం కూడా గర్బాలయ స్పర్శ దర్శనాలు లేక పోవడంతో మంగళవారం తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో అధిక సంఖ్యలో భక్తులు వేచి ఉండి స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు. అలాగే పలు ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.