Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నప్రసాద వితరణ విభాగానికి చీరాల భ్రమరాంబికా సేవా సమితి వారు శుక్రవారం లక్ష విస్తరాకులు విరాళంగా అందజేశారు. అన్నపూర్ణ భవన్ లో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజుకు ఈ విస్తరాకులను అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ విస్తరాకులు సమర్పించామని తెలిపారు. వీటి విలువ రూ.3 లక్షల పై చిలుకు ఉంటుందన్నారు. కొన్నేండ్లుగా వీరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తరాకులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు ఎంవీ మహాలక్ష్మి, సేవా సమితి ప్రతినిధులు, శ్రీశైల దేవస్థానం అన్న ప్రసాద వితరణ విభాగం సహాయ కార్య నిర్వహణాధికారి ఎం ఫణిధర ప్రసాద్, పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకటో తేదీ నుంచి 11 వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగానే దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు శుక్రవారం అన్న ప్రసాద వితరణ భవనాన్ని పరిశీలించారు. అన్నదాన భవనంలోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి చూసే గదులు, వంట శాల తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో ఈఓ పెద్ది రాజు మాట్లాడి, అన్న ప్రసాద వితరణపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దేవస్థానం అందిస్తున్న అన్న ప్రసాదాల పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తుండాలని సూచించారు.
సాధారణ భక్తులు, శివదీక్షా స్వాములు, ఉత్సవాల్లో ప్రత్యేక విధుల నిర్వహణకు వచ్చిన సిబ్బంది, ధార్మిక సంస్క్రుతి కార్యక్రమాలకు వచ్చే కళాకారులకు లోటుపాట్లు లేకుండా అన్న ప్రసాద వితరణ అందజేయాలని సిబ్బందిని ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలన్నారు. ఉత్సవాల సమయంలో క్షేత్ర పరిధిలో పలు చోట్ల స్వచ్ఛంద సేవాకర్తలు కూడా అన్నదానం చేస్తున్నారన్నారు. అటువంటి సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. అన్న ప్రసాద భవనాన్ని, వంటశాలను తరుచుగా శుభ్రపరుస్తూ శుచీ శుభ్రతలను పాటిస్తుండాలని సూచించారు.