అమరావతి : ఎన్నికలకు ముందు రంకెలు వేసిన వైసీపీ నాయకులంతా ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Budda Venkanna) ఎద్దేవా చేశారు. కొడాలినాని, పేర్నినాని, వల్లభనేని వంశీ, మరి కొందరు అధికారం ఉందనే అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని గుర్తు చేశారు.
తాజాగా ఏపీ అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాక వారి చిరునామా కనిపించడం లేదని సెటైర్లు వేశారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పారిపోయారని ఆరోపించారు. వంశీ ఆనాడు చంద్రబాబు, లోకేశ్‌ను దూషించి గన్నవరం టీడీపీ(TDP Office) కార్యాలయంపై దాడి చేయించారని పేర్కొన్నారు. ఆయన క్షమాభిక్షకు కూడా అర్హుడు కాదని, నమ్మక ద్రోహని మండిపడ్డారు. అతనిపై ఎవ్వరూ కూడా జాలిపడొద్దని సూచించారు.
టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక కుట్రలు చేశారని, వైఎస్ చనిపోతే వంశీ పార్టీ చేసుకున్నారని వెల్లడించారు. . అతను చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందేని అన్నారు. అతను ఎక్కడ కనిపించినా పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, కార్యకర్తలను తిడుతుంటే వద్దని జగన్ ఏనాడు చెప్పలేదని వివరించారు. ప్రజలు కొట్టిన దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) బిత్తర చూపులు చూస్తున్నారని అన్నారు.