Vallabhaneni Vamshi | ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్నా మరో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది స్పెషల్ కోర్టు. గత రెండేళ్ల కిందట గన్నవరం తెలుగుదేశం పార్టీపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గత ఫిబ్రవరిలో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేలతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో రెండుసార్లు కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా మూడోసారి బెయిల్‌ను ఇచ్చింది. కోర్టు బెయిల్ ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందగా.. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఇంకా బెయిల్ రాలేదు. ఈ కేసులోనే ఆయన రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. ఇదిలా ఉండగా.. బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో వంశీ ఆరోగ్య సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత జైలుకు తరలించారు.