Srinivasa Rao | సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు మళ్లీ ఎన్నికయ్యారు. నెల్లూరులో జరిగిన 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా.. సోమవారం నాడు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావును మరోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 15 మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో కలిసి మొత్తం 50 మందిని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. ఏడురుగు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులతో కమిటీ ఎన్నికైంది.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకటేశ్వరరావు, బాబురావు, ప్రభాకర్ రెడ్డి, రమాదేవి, తులసీదాస్, వెంకటేశ్వర్లు, లోకనాథం, సురేంద్ర, సుబ్బరావమ్మ, రాంభూపాల్, ఉమామహేశ్వరరావు, బలరాం, మూలం రమేశ్, ఏవీ నాగేశ్వరరావును ఎంపిక చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వంకాయలపాటి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లిలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1960లో జన్మించిన ఆయన.. ప్రకాశం జిల్లాలోనే ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. 1974-76లో నెల్లూరు జవహర్ భారతి కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలోనే ఆయన ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. మొదటి సంవత్సరంలోనే విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు. 1978-79లో ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1979 నుంచి 1982 వరకు కార్యదర్శిగానూ పనిచేస్తూ న్యాయ విద్యలో చేరారు. 1982-84లో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తూనే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పలు రాష్ట్రస్థాయి ఆందోళనల్లో పాల్గొన్నారు.
1985లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1992లో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శగా ఎంపికయ్యారు. 2000లో ప్రజాశక్తి పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. 2005లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, అనంతరం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దళిత శోషణ్ ముక్తి మంచ్ వ్యవస్థాపక కన్వీనర్, జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు.